The Paradoxical Journey of Life

1 min readpoemmetaphysics

సరళి కందని సమాహారాల సందోహం

చివరివరకు కానరాని గమ్యం

దిక్సూచికందని దిశా నిర్దేశం ఈ జీవితం

నడక నేర్పేది, నడిచే దారిలో ముళ్ల పొదలను ఉంచేది

నిశి రాత్రిలో వెలుగు దివ్వెలా దరిచేరేది

గాయాన్ని చేసేది, వొడి చేర్చుకుని ఓదార్చేది

మాట నేర్పేది, ఏమరుపాటు చూపిస్తే గుణపాఠం చెప్పేది

బంధాలు కలిపేది, బాధల బరువు మిగిల్చేది

కష్టపెట్టేది, కష్టాల కలతలలో చేయూతనిచ్చేది మనసు గాయాన్ని మరిపించేది

ఎవరికైనా తప్పనిది

ఎదురు చూపులకు నప్పనిది

నిర్మోహమాటానికి పోనిది, నిరీక్షణలకు కరగనిది

అసమానతలను అవలోకంగా ఆవిరి చేసేది

నిస్సహాయులను చేసి తనలోకి ఐక్యం చేసుకునేది

ఒక్క క్షణం ఆగి ఆసరా అడిగితే నిశ్చలమైన నిలకడ చూపేది

అదే కదా జీవితం!